Thursday, October 31, 2024
Homeజాతీయంరూ.1,200 కోట్ల కుంభకోణంలో ఐపీఎస్ అధికారిణీ

రూ.1,200 కోట్ల కుంభకోణంలో ఐపీఎస్ అధికారిణీ

Date:

ఓ ఐపీఎస్ అధికారిణి భారీ కుంభకోణం కేసు దర్యాప్తులో ఫోర్జరీ, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సీఐడీ దర్యాప్తులో ఇది బయటపడింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆమెపై కేసు నమోదు చేసింది. మహారాష్ట్రలోని జల్గావ్‌లో ఉన్న భైచంద్ హీరాచంద్ రైసోని క్రెడిట్ సొసైటీలో రూ.1,200 కోట్ల కుంభకోణం వెలుగుచూసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ పేరుతో వందలాది వ్యక్తులను ఆ సంస్థ మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 2020 నుంచి 2022 వరకు ఆర్థిక నేర విభాగం డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టేక్‌ ఈ స్కామ్‌పై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)కు నేతృత్వం వహించారు. అయితే ఒకే రోజు ఒకే నేరం కింద మూడు కేసులు నమోదు చేయడం, ఫిర్యాదుదారులు హాజరుకాకుండానే వారి సంతకాలను ఫోర్జరీ చేయడం, తప్పుడు పత్రాలు సృష్టించడంలో ఆమె ప్రమేయం ఉన్నట్లు సీఐడీ విచారణలో వెల్లడైంది. దీంతో సీఐడీ నివేదిక ఆధారంగా ఈ వ్యవహారంపై కేసు నమోదు చేయాలని పూణె పోలీసులను మహారాష్ట్ర హోంశాఖ ఆదేశించింది.

మరోవైపు 2020లో ఈ కుంభకోణం కేసును సీబీఐకి బదిలీ చేశారు. దీంతో 12 బ్యాంకులను మోసం చేసినందుకు ఢిల్లీకి చెందిన కంపెనీ డైరెక్టర్లపై అవినీతి, చీటింగ్ కేసు నమోదైంది. అలాగే ఈ స్కామ్‌పై దర్యాప్తులో ఫోర్జరీ, తప్పుడు పత్రాలు సృష్టించడం వంటి నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలున్న ఐపీఎస్ అధికారిణి భాగ్యశ్రీ నవ్‌టేక్‌పై కేసు నమోదు చేసినట్లు సీబీఐ గురువారం ప్రకటించింది. భారత శిక్షాస్మృతిలోని 120-బీ, 466, 474, 201 సెక్షన్లకు సంబంధించి ఆమెపై అభియోగాలు మోపినట్లు పేర్కొంది.