తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామేశ్వరం ఆలయ సందర్శనకు వెళ్లిన ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. సముద్రతీరంలో దుస్తులు మార్చుకునే గదిలో రహస్య కెమెరా లభ్యమైంది. ఇది చూసిన సదరు భక్తురాలు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. పుదుకోట్టైకి చెందిన మహిళ కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం ఆలయ సందర్శనకు వెళ్లింది. ఆలయ ఆచారాల్లో భాగంగా అగ్నితీర్థం వద్ద సముద్రస్నానం ఆచరించింది. అనంతరం దుస్తులు మార్చుకునేందుకు తీరం వద్ద ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన గదిలోకి వెళ్లింది. అక్కడ రహస్యంగా ఉంచిన కెమెరాలను గుర్తించింది. ఈ విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు, ఆలయ అధికారుల దృష్టికిక తీసుకెళ్లింది.
మహిళ ఫిర్యాదుతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఆలయ అధికారులు గదిలో రహస్యంగా అమర్చిన కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. బూత్ నిర్వాహకులు రాజేష్‌ను అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ తర్వాత సమీపంలో టీస్టాల్ నడుపుతున్న మీరా మొయిదీన్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అతడు రాజేష్‌కు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.