Wednesday, January 15, 2025
HomeUncategorizedయూట్యూబ్ చూస్తూ బాలుడికి శ‌స్త్ర‌చికిత్స

యూట్యూబ్ చూస్తూ బాలుడికి శ‌స్త్ర‌చికిత్స

Date:

సరైన విద్యార్హతలు లేని ఓ నకిలీ వైద్యుడు యూట్యూబ్‌ చూస్తూ బాలుడికి శస్త్రచికిత్స చేసిన ఘటన బిహార్‌లో చోటు చేసుకొంది. ఈ ఘటనలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సరన్‌లో నివాసముంటున్న ఓ బాలుడు అనారోగ్యంతో పలుమార్లు వాంతులు చేసుకున్నాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు అతడిని సమీపంలోని గణపతి ఆస్పత్రికి తరలించారు. కాసేపటికి వాంతులు తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే అక్కడున్న నకిలీ వైద్యుడు బాలుడి పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని.. వాటిని తొలగించేందుకు ఆపరేషన్‌ తప్పనిసరంటూ చెప్పాడు. అందుకు కుటుంబసభ్యులను బలవంతంగా ఒప్పించాడు.

అయితే.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ బాలుడికి ఆపరేషన్‌ చేశాడు. కాసేపటికే అతడి పరిస్థితి విషమించింది. కంగారు పడిన ఆ నకిలీ వైద్యుడు మెరుగైన చికిత్స కోసం అతడిని పెద్దాస్పత్రికి అంబులెన్స్‌లో తరలించాడు. బాలుడు మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మృతదేహాన్ని అక్కడే వదిలేసి నకిలీ డాక్టర్‌ సహా సిబ్బంది పరారయ్యారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ”మా మనవడికి పలుమార్లు వాంతులు కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం. కాస్త కుదుటపడిన తర్వాత ఇంటికి తీసుకెళ్తుండగా.. ఆ వైద్యుడు ఆపరేషన్‌ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. యూట్యూబ్‌ చూస్తూ సర్జరీ చేయడాన్ని మేం గమనించాం. అతడి విద్యార్హతలు తెలుసుకోకుండా మా అబ్బాయిని ఆస్పత్రిలో చేర్పించాం” అంటూ బాలుడి తాతయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.