భారత్ మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే ఆదివారం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం విస్తృత చర్చలు జరిపారు. శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత దిసనాయకే తొలి విదేశ పర్యటన ఇదే. చర్చలకు ముందు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యారు. ప్రధాని మోదీ, అనుర దిసానాయక్ మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలను విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వివరించారు.
ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, భద్రతా సహకారంపై జరిగినట్లు తెలిపారు. విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. భారత్‌లో తొలిసారిగా పర్యటిస్తున్న దిసనాయకేను కలవడం ఆనందంగా ఉందన్నారు. నైబర్‌హుడ్ ఫస్ట్ విధానం, సాగర్ ఔట్‌లుక్‌కి శ్రీలంక కీలకమైందని.. ప్రధాని మోదీ, దిసనాయక మధ్య చర్చలు విశ్వాసం, సహకారాన్ని పొందిస్తాయని ఆశిస్తున్నానన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జరిపిన చర్చల్లో పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు దిసనాయకే పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోగా.. కేంద్ర మంత్రి ఎల్ మురుగన్‌తో పాటు అధికారులు స్వాగతం పలికారని సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు.