Wednesday, January 8, 2025
Homeజాతీయంమ‌ళ్లీ కీలక సమావేశాన్ని రద్దు చేసిన షిండే

మ‌ళ్లీ కీలక సమావేశాన్ని రద్దు చేసిన షిండే

Date:

మ‌హారాష్ట్ర కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు ఇంకా కొలిక్కి రాలేదు. తాత్కాలిక ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే అనారోగ్యం కారణంగా సోమవారం ముంబైలో జరగాల్సిన కీలక సమావేశం రద్దైంది. మరోవైపు అజిత్ పవార్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ అగ్రనాయకులతో సమావేశం కానున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు, పోర్ట్‌ఫోలియో కేటాయింపులపై వారితో చర్చించనున్నారు.

మహారాష్ట్రలో తదుపరి సీఎం ఎవరు అన్నది ఇంకా తేలలేదు. సీఎం పదవితోపాటు పోర్ట్‌ఫోలియో కేటాయింపులను ఖరారు చేయడానికి మహాయుతి నేతల సమావేశం సోమవారం జరుగాల్సి ఉంది. అయితే గొంతు ఇన్ఫెక్షన్, జ్వరంతో బాధపడుతున్న ఏక్‌నాథ్‌ షిండే ముంబైలోని తన అధికారిక నివాసమైన వర్షాకు తిరిగి రాలేదు. ప్రస్తుతం ఆయన సతారా జిల్లాలోని తన స్వగ్రామంలోనే ఉన్నట్లు తెలుస్తున్నది. దీంతో ముఖ్యమంత్రితోపాటు మంత్రి పదవులను ఖరారు చేయడంలో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. మరోవైపు మహాయుతి నేతల మధ్య ఇవాళ ఎలాంటి షెడ్యూల్ లేదని శివసేన వర్గాలు తెలిపాయి. కూటమిలోని ఏకైక పెద్ద పార్టీ అయిన బీజేపీ నిర్వహించే ఈ సమావేశం కోసం తమ పార్టీ ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. మహాయుతి నేతల సమావేశం మంగళవారం జరుగుతుందని వెల్లడించింది.