Tuesday, October 1, 2024
Homeజాతీయంమ‌ళ్లీ ఆందోళ‌న‌లో కోల్‌క‌తా డాక్ట‌ర్లు

మ‌ళ్లీ ఆందోళ‌న‌లో కోల్‌క‌తా డాక్ట‌ర్లు

Date:

జూనియర్‌ వైద్యురాలి హత్యాచార ఘటనకు సంబంధించి జూనియర్‌ వైద్యులు మంగళవారం తిరిగి ఆందోళనలు చేపట్టారు. తమ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరి కనిపించడం లేదని వారు ఆరోపించారు. ‘మా భద్రతకు సంబంధించిన డిమాండ్లను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల వైఖరి కనిపించడం లేదు. సీఎం మమతా బెనర్జీ చర్చల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. విధులకు శాశ్వతంగా విరమణ తెలిపి ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించాం’ అని ఓ డాక్టర్‌ పేర్కొన్నారు. అదేవిధంగా తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోకపోతే ఇది పూర్తిస్థాయిలో కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. సెంట్రల్‌ కోల్‌కతాలోని స్క్వేర్‌ కళాశాల నుంచి ధర్మతల వరకు బుధవారం జూనియర్‌ వైద్యులు మార్చ్‌కు పిలుపునిచ్చారు. తమతో పాటు ఈ మార్చ్‌లో పాల్గొనాలని ప్రజలను కోరారు.

పశ్చిమబెంగాల్‌లోని ఆర్జీకర్‌ ప్రభుత్వ కళాశాల ఆసుపత్రిలో ఆగస్టు 9న జూనియర్‌ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధితురాలికి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు నిరసనలు చేపట్టారు. ఈ ఘటన పెనుదుమారం రేపడంతో సుప్రీంకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించింది. ఈ క్రమంలో వైద్య విద్యార్థులు విధుల్లో చేరాలని సూచించింది. ఇక, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపి తమ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో 42 రోజులు కొనసాగించిన నిరసనలు విరమించి గతనెల 21న పాక్షికంగా విధుల్లో చేరారు.