Friday, January 10, 2025
Homeజాతీయంమ‌ణిపుర్‌లో మ‌రోసారి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు

మ‌ణిపుర్‌లో మ‌రోసారి హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు

Date:

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మళ్లీ హింస చెల‌రేగింది. దీంతో సోమవారం నుంచి పలువురు మహిళలు, చిన్నారుల జాడ తెలియడం లేదు. వారి జాడ గుర్తించేందుకు భద్రతా సిబ్బంది ముమ్మర గాలింపు చేపడుతున్నారు. ”కనిపించకుండా పోయిన ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారుల కోసం బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నాయి.’ అని మణిపుర్ పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

మణిపుర్‌లో సోమవారం భద్రతా బలగాలతో జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 10 మంది కుకీ మిలిటెంట్లు హతమయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకూ గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. ”జిరిబామ్‌ జిల్లాలో సైనికుల్లా దుస్తులు ధరించిన మిలిటెంట్లు అధునాతన ఆయుధాలతో బోరోబెక్రా పోలీస్‌ స్టేషన్‌పై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దాని సమీపంలో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ క్యాంపుపైనా దాడులు చేశారు. అనంతరం పక్కనే ఉన్న జకురాడోర్‌ కరోంగ్‌ గ్రామం వైపు దూసుకెళ్లి, అనేక దుకాణాలకు నిప్పుపెట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలు-మిలిటెంట్ల మధ్య భారీ స్థాయిలో కాల్పులు చోటుచేసుకున్నాయి” అని అధికారులు వివరించారు. జాతుల మధ్య వైరంతో గత ఏడాది మణిపుర్ భగ్గుమన్న విషయం తెలిసిందే. అప్పుడు ఎన్నో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. తర్వాత కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో కొద్దినెలలుగా కాస్త ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. ఈ తరుణంలోనే భద్రతాబలగాలు, మిలిటెంట్ల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.