ఈనెల 11న తమిళనాడులోని కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును మైసూరు- దర్భంగా ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న రైలు ప్రమాదంపై అధికారులు భిన్న కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ప్రమాదానికి కారణం సాంకేతిక లోపమా? సిగ్నలింగ్ వైఫల్యమా? కుట్ర కోణమా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎవరి వద్ద అయినా ఆధారాలు ఉంటే..వాటితో పాటు చట్టబద్ధమైన విచారణకు హాజరు కావాలని కోరారు. కాగా ఈ కేసు విచారణ పార్క్ టౌన్‌లోని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) కార్యాలయంలో రైల్వే భద్రత కమిషనర్ నేతృత్వంలో జరగనున్నట్లుగా వెల్లడించారు.
మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా బిహార్‌లోని దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్ (12578) రైలు శుక్రవారం వేగంగా వచ్చి తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొన్న విషయం తెలిసిందే. దీంతో 13 కోచ్‌లు పట్టాలు తప్పాయి. కొన్ని చెల్లాచెదురుగా పడిపోగా, మరికొన్ని ఒకదాని పైకి మరొకటి ఎక్కాయి. ఈ ప్రమాదంపై స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు తిరువళ్లూరు పోలీసులు నాలుగు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి ఎన్ఐఏ(NIA)తో సహా వివిధ ఏజెన్సీల బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.