పారిస్ ఒలింపిక్స్‌లో ఒలింపిక్ పతకం సాధించిన షూటర్ మను బాకర్.. తన పిస్టల్‌ను ప్రధానికి చూపించింది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కాంస్యం సాధించిన భారత హాకీ పురుషుల జట్టు.. ప్రధానికి ప్రత్యేక కానుకనిచ్చింది. జట్టు ఆటగాళ్లంతా సంతకం చేసిన ఓ జెర్సీ, హాకీ స్టిక్‌ను మోడీకి అందించారు. ఒలింపిక్స్‌లో కాంస్యం అందుకున్న రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. అనంతరం ప్రధాని క్రీడాకారుల మధ్య కలియదిరుగుతూ వారితో సంభాషించారు. ఒలింపిక్స్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ”పారిస్ ఒలింపిక్స్‌లో ఈ యువ ఆటగాళ్లు మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మరిన్ని కొత్త కలలు, ఆశయాలతో ముందుకెళ్దాం. వాటికి సాకారం కోసం నిరంతరం కృషి చేద్దాం” అని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు. అంతకుముందు ఎర్రకోట వద్ద జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో ఒలింపిక్ అథ్లెట్ల బృందం పాల్గొన్న సంగతి తెలిసిందే. బుధవారం వీరంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఓ రజతం, అయిదు కాంస్యాలు గెలిచిన సంగతి తెలిసిందే. యువ షూటర్ మను బాకర్ ఏకంగా ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ విశ్వ క్రీడల్లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పోటీపడ్డారు.