Wednesday, January 15, 2025
HomeUncategorizedపూజా ఖేడ్కర్ తక్షణ కస్టడీ అవసరం లేదు

పూజా ఖేడ్కర్ తక్షణ కస్టడీ అవసరం లేదు

Date:

వివాదాస్పద ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌కు ఢిల్లీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తక్షణ కస్టడీ అవసరం లేదంటూ ఆమెకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అరెస్టు నుంచి ఆగస్టు 21 వరకు రక్షణ కల్పించింది. ముందుస్తు బెయిల్‌ కోసం పూజ పిటిషన్ వేసిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులకు కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.

నకిలీ పత్రాలతో పరీక్షను క్లియర్‌ చేసినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్‌ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు దిల్లీ కోర్టు ఇదివరకే నిరాకరించింది. ఈ క్రమంలో ఆమె దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వడానికి తగిన సమయం ఇవ్వాలని పూజ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. ఈ క్రమంలోనే ఆమెకు ఊరట లభించింది.

ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఫోర్జరీ కేసులో దర్యాప్తు ప్రారంభించారు. దీని విచారణకు హాజరుకావాలని త్వరలో ఆమెకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ఆమె అరెస్టు భయంతో దుబాయ్‌కి పరారైనట్లు వార్తలు వచ్చాయి. ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. గత కొద్దిరోజులుగా ఆమె ఎక్కడుందనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.