ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే పార్లమెంట్ సెషన్‌లో బిల్లును కచ్చితంగా ఉభయసభల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. లోక్‌సభ ఎన్నికలతోపాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫారసులు చేసింది. అనంతరం బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే తరువాయిగా ఉంది.
ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదముద్ర పడితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి ముందు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పంపాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. జేపీసీ అన్ని పార్టీల ప్రతినిధులతో ఈ బిల్లుపై చర్చించి అందరి అంగీకారాన్ని తీసుకోనుంది. అంతేగాక అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్‌ల నుంచి ప్రభుత్వం ఈ బిల్లుపై అభిప్రాయాలు కోరింది. మేధావులు, నిపుణులు, పౌర సమాజ సభ్యులు తదితరులను కూడా ఈ బిల్లుపై చర్చలో భాగస్వాములను చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆ తర్వాత సాధారణ ప్రజానీకం నుంచి కూడా ఈ బిల్లుపై అభిప్రాయాలను కోరనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.