Friday, January 10, 2025
Homeజాతీయంపాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు భార‌త్ వీసా నిరాక‌ర‌ణ

పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు భార‌త్ వీసా నిరాక‌ర‌ణ

Date:

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ పాక్‌లో జరిగితే తమ జట్టును పాకిస్తాన్‌కు పంప‌మ‌ని బీసీసీఐ ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ విషయాన్ని ఐసీసీ.. పీసీబీకి తెలియజేసింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్‌లో జరిగేలా అంగీకరించాలని కోరింది. దీనిపై పాక్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహరం కొనసాగుతున్నవేళ.. భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, దిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం చాలా మంది పాకిస్థాన్‌ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు రెండు నెలల ముందుగానే దరఖాస్తులు సమర్పించగా వాటిని భారత హైకమిషన్‌ చూసిచూడనట్లుగా వదిలేసింది. తాజాగా ఆటగాళ్లకు వీసాలు జారీ చేయబోమని ప్రకటించింది.

భారత ప్రభుత్వ నిర్ణయంపై పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులోని సగం మందికి ఎలాంటి వివరణ లేకుండా వీసా నిరాకరించారని ఆయన పేర్కొన్నారు. ”గతేడాది భారత్‌లో పోటీపడి విజయం సాధించిన ఆటగాళ్లతో సహా జట్టులోని సగం మందికి వివరణ లేకుండా వీసాలు నిరాకరించారు.ప్రపంచ యూత్ ఛాంపియన్‌, ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ను గెలిచిన పాకిస్థాన్ గైర్హాజరు కావడం టోర్నమెంట్‌కు గట్టిదెబ్బ” అని పేర్కొన్నారు.