జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం వరకు కొనసాగింది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం పదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. అంతేకాకుండా 2019లో కేంద్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇవే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల దృష్టి జమ్మూ కశ్మీర్ ఎన్నికలపై ఉంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో అత్యధికంగా ఓటింగ్ జరిగేలా అసెంబ్లీ ఎన్నికల కోసం పోలీసులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీనియర్ అధికారి వీకే బిర్డి తెలిపారు.
తొలిదశలో పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఏడు జిల్లాల్లో విస్తరించి ఉన్న 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుంది. తొలి దశలో 23 లక్షల మంది ఓటర్లు 90 మంది స్వతంత్ర అభ్యర్థులతో సహా 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. ఎన్నికల సంఘం ప్రకారం.. ఫేజ్ 1లో మొత్తం 23,27,580 మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులు. వీరిలో 11,76,462 మంది పురుషులు, 11,51,058 మంది మహిళలు, 60 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. మొత్తం 14,000 మంది పోలింగ్ సిబ్బంది.. 3,276 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. ఇక, జమ్మూ కశ్మీర్ రెండో దశ ఓటింగ్ సెప్టెంబర్ 25న, మూడో దశ అక్టోబర్ 1న జరగనుంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు అక్టోబర్ 8న జరగనుంది.