దేశంలో విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. గత పది రోజులుగా ఎయిర్ ఇండియా సహా పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టిస్తోంది. దేశ, విదేశాలకు వెళ్లే వందకుపైగా విమానాలకు ఇప్పటికే ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 80కిపైగా విమానాలకు ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది. ఇండిగో, ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్‌లైన్స్‌కు చెందిన దాదాపు 85 విమానాలకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇందులో 25 ఆకాశా ఎయిర్ ఫ్లైట్స్కాగా, 20 ఎయిర్ ఇండియా, 20 ఇండిగో, 20 విస్తారా ఫ్లైట్స్ ఉన్నాయి. సోషల్ మీడియా ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆయా విమానాల్లో తనిఖీలు చేపట్టారు.
గత పది రోజుల్లోనే (తాజా బెదిరింపులతో సహా) 250కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇలాంటి బెదిరింపులపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిందితులను నో ఫ్లై లిస్టులో చేర్చనున్నట్లు కేంద్ర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు.