Wednesday, December 25, 2024
Homeజాతీయంప‌ట్టాలెక్కిన వందే భార‌త్ స్లీప‌ర్ రైలు

ప‌ట్టాలెక్కిన వందే భార‌త్ స్లీప‌ర్ రైలు

Date:

ఎట్ట‌కేల‌కు వందే భారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్యాసింజర్‌ ట్రెయిన్‌ను విజయవంతంగా పరీక్షించారు. మధ్యప్రదేశ్‌లోని కజురహో-ఉత్తరప్రదేశ్‌లోని మహోబా రైల్వే స్టేషన్ల మధ్య రెండు రోజులపాటు ట్రయల్‌రన్‌ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం చైన్నై ఐసీఎఫ్‌ నుంచి కజురహో చేరిన వందేభారత్‌ స్లీపర్‌ రైలు.. శనివారం అక్కడి నుంచి మహోబాకు చేరుకున్నది. మరుసటి రోజు కజురహో నుంచి తిరిగి మహోబాకు వచ్చింది.

ఎస్‌ఆర్‌డీవో ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రయల్‌ రన్‌లో రైల్వే టెక్నికల్‌ టీమ్‌తోపాటు, ఐసీఎప్‌ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈసందర్భంగా కజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. తిరుగు ప్రయాణంలో 130 కి.మీ. వేగంతో నడిచింది. ఈ సందర్భంగా అధికారులు సాంకేతిక అంశాలను పరిశీలించారు. అయితే వందేభారత్‌ రైలును గంటకు 160 నుంచి 200 కి.మీ. స్పీడ్‌తో వెళ్లేలా తయారుచేశారు. కాగా ఈ రైలు వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలని ఇండియన్‌ రైల్వే భావిస్తున్నది. దీనికోసం పది రైళ్లను సిద్ధం చేస్తున్నది.

వందే భారత్ స్లీపర్ రైలుకు చాలానే ప్రత్యేకలున్నాయి. విమానం తరహాలో ప్రయాణికులు ఈ రైలులో సౌకర్యాలుంటాయి. ఈ రైలు ముందు విలాసవంతమైన హోటల్స్‌ సైతం దిగదుడుపేనని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రైలు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లనున్నది. వందే భారత్‌ స్లీపర్‌ రైలులో ఒకేసారి 823 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో ఒక ఫస్ట్ ఏసీ కోచ్‌, నాలుగు సెకండ్ ఏసీ, 11 థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి.