Saturday, December 21, 2024
Homeజాతీయంనిర్మ‌ల్ సీతారామ‌న్ తీరు స‌రిగా లేదు

నిర్మ‌ల్ సీతారామ‌న్ తీరు స‌రిగా లేదు

Date:

రాజ్య‌స‌భ‌లో భార‌త రాజ్యాంగంపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై విమర్శలు చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై.. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మండిపడ్డారు. నిర్మలా సీతారామన్‌ జేఎన్‌యూ నుంచి పట్టభద్రురాలు అయి ఉండవచ్చు, ఆర్థిక నిపుణురాలే కావచ్చు.. కానీ ఆమె తీరు మాత్రం సరిగా లేదని ఖర్గే విమర్శించారు.

నెహ్రూ, ఇందిరాగాంధీలను బీజేపీ కించపరుస్తున్నదని, బీజేపీ పాలనలో ప్రజ్వాస్వామ్యం ప్రమాదంలో పడిందని మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు. బీజేపీ విభజన సూత్రాన్ని నమ్ముతున్నదని, కానీ ప్రజలకు కావాల్సింది మాత్రం స్వేచ్ఛ, సమానత్వమని చెప్పారు. దేశం కోసం బీజేపీ నేతలు ఎప్పుడూ పోరాటం చేయలేదని, అలాంటి వ్యక్తులు నెహ్రూ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శలు గుప్పించారు. బీజేపీ రాజ్యాంగానికి అనుకూలమా.. వ్యతిరేకమా..? అని ప్రశ్నించారు. జాతీయ జెండాను, రాజ్యాంగాన్ని బీజేపీ ఏనాడు గౌరవించలేదని, అలాంటి వాళ్లు ఇప్పుడు రాజ్యాంగం గురించి మాకు పాఠాలు చెబుతుండటం వింతగా ఉందని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం బలోపేతానికి గత 11 ఏళ్లలో ప్రధాని మోదీ ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీజేపీ నేతలు అబద్ధాలతో దేశాన్ని తప్పదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.