ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లో సివిల్ సర్వీసెస్ అభ్యర్థిని తాజాగా ఆత్మహత్య చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన అంజలి అనే విద్యార్థిని గత కొన్ని రోజులుగా ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ.. సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు బలవన్మరణానికి ముందు ఓ నోట్కూడా రాసి పెట్టింది. ‘మమ్మీ, పాపా.. నన్ను క్షమించండి. నిజంగా నేను చాలా విసిగిపోయాను. ఇక్కడ కేవలం సమస్యలు మాత్రమే ఉన్నాయి. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సాధ్యమైనంత వరకూ ప్రయత్నించాను. కానీ, నా వల్ల కాలేదు’ అని సూసైడ్ నోట్ రాసి పెట్టి బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ఘటనపై అంజలి స్నేహితురాలు శ్వేత మాట్లాడుతూ.. ‘అంజలి యూపీఎస్సీ ఎగ్జామ్ను మూడు సార్లు ప్రయత్నించారు. కానీ పరీక్షల్లో ఫలితం రాలేదు. దీంతో తీవ్రమైన ఒత్తిడికి లోనైంది. దానికి తోడు కొన్ని నెలలుగా పీజీల్లో అద్దె కూడా పెరుగుతుండటంతో ఆర్థిక పరిస్థితులు తనని చుట్టుముట్టాయి’ అని తెలిపింది. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద సంఘటనకు దారితీసిన పరిస్థితులపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.