దేశంలో తొలిసారిగా పూర్తిస్థాయిలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌లో మహిళల రిజర్వ్ బెటాలియన్‌ను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. విమానాశ్రయాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో పెరుగుతున్న విధులను దృష్టిలో ఉంచుకుని దాదాపు 1000కిపైగా మహిళా సిబ్బందితో కూడిన సీఐఎస్‌ఎఫ్ రిజర్వ్ బెటాలియన్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ‘సీఐఎస్‌ఎఫ్’ ప్రస్తుతం 12 రిజర్వ్ బెటాలియన్లను కలిగి ఉంది. మహిళా సిబ్బందితో కూడిన సీఐఎస్‌ఎఫ్ రిజర్వ్ దళాలు సివిల్ విమానాశ్రయాలు, దిల్లీ మెట్రోలతో పాటుగా తాజ్ మహల్, ఎర్రకోట వంటి చారిత్రక కట్టడాల వద్ద పహారా కాస్తాయని అధికారులు పేర్కొన్నారు.
దాదాపు 1.70 లక్షల మంది సిబ్బందితో కూడిన ‘సీఐఎస్‌ఎఫ్’.. కేంద్ర హోంశాఖ అధీనంలోని కేంద్ర సాయుధ పోలీసు దళం. ఇది దిల్లీలోని పలు కేంద్రశాఖల భవనాలు, పౌర విమానాశ్రయాలు, అణుశక్తి, ఏరోస్పేస్ కేంద్రాలకు భద్రత కల్పించడంతో పాటు పుణెలోని ఇన్ఫోసిస్ కార్యాలయాలు, జామ్‌నగర్‌లోని రిలయన్స్ రిఫైనరీ (గుజరాత్) వంటి ప్రైవేట్ సంస్థలకూ తమ సేవలు అందిస్తున్నాయి.