Thursday, October 31, 2024
Homeజాతీయందేశంలో ఉగ్ర‌వాదాన్ని పూర్తిగా తుడిచేద్దాం

దేశంలో ఉగ్ర‌వాదాన్ని పూర్తిగా తుడిచేద్దాం

Date:

దేశంలో ఉగ్ర‌వాదంపై యుద్ధం ఇంకా ముగియ‌లేద‌ని, ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని అన్నారు. డ్రగ్స్‌, భారత వ్యతిరేక చర్యలు, ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు.

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని.. వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని అమిత్‌ షా అన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు అమిత్‌ షా నివాళులర్పించారు. 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.