Thursday, November 14, 2024
Homeజాతీయంత్వర‌లో అన్ని భాష‌ల్లో వైద్య విద్య‌

త్వర‌లో అన్ని భాష‌ల్లో వైద్య విద్య‌

Date:

దేశ‌వ్యాప్తంగా త్వరలోనే హిందీ సహా పలు భారతీయ భాషల్లో వైద్య విద్య అందుబాటులోకి వస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్ష మెడికల్ సీట్లను జోడించామని, రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకొస్తామని వైద్య విద్యార్థులకు ప్రధాని హామీ ఇచ్చారు. దేశంలో 1.5 లక్షలకు పైగా ఉన్న ‘ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు’ బడుగు బలహీనవర్గాలకు మెరుగైన సేవలందిస్తున్నాయని తెలిపారు. దేశంలో దాదాపు నాలుగు కోట్ల మంది ప్రజలు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారన్నారు. బిహార్‌లోని దర్భంగాలో నిర్వహించిన సభలో ప్రధాని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దర్భంగాలో ఎయిమ్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేసి, రూ.12,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరించారు.

బిహార్‌లో నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. ఆటవిక రాజ్యంగా ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు కేవలం తప్పుడు వాగ్దానాలు మాత్రమే చేశాయని.. కానీ రాష్ట్రంలో నీతీశ్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. ముందు ముందు రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.