Thursday, October 31, 2024
Homeజాతీయంతెలంగాణ గ్రూప్‌-1పై జోక్యం చేసుకోం

తెలంగాణ గ్రూప్‌-1పై జోక్యం చేసుకోం

Date:

తెలంగాణలో జ‌రుగుతున్న గ్రూప్‌-1 ప‌రీక్ష‌పై అభ్యర్థుల దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో అన్ని అంశాలూ స్పష్టంగా చెప్పిందని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లో ఉన్నప్పుడు జోక్యం చేసుకోవడం సరికాదని పేర్కొంది. ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది.

వాదనల సందర్భంగా.. 14 ఏళ్ల తర్వాత గ్రూప్‌-1 పరీక్ష జరుగుతోందని అభ్యర్థుల తరఫు న్యాయవాది తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 తెచ్చిందని తెలిపారు. పరీక్షపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు గ్రూప్‌-1 పరీక్ష నిలుపుదల కుదరదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తీర్పు వచ్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా సీఎం పట్టించుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.