దేశంలోని ఆల్ ఇండియా రేడియోతో నా అనుభవం చాలా ఏళ్ల కిందటే మొదలైందని, ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం భాషల్లో వచ్చే వార్తలు వింటూ తాను పెరిగానని అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. సుప్రీంకోర్టు వజ్రోత్సవాల్లో భాగంగా సీజేఐ తాజాగా ఆల్ ఇండియా రేడియోతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈసందర్భంగా ఆకాశవాణిలో ప్రజెంటర్‌గా తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో మా అమ్మానాన్నలతో కలిసి ఆకాశవాణిలో వచ్చే వార్తల బులిటెన్‌లను వింటూ నా బాల్యం గడిచింది. ‘ఆకాశవాణి.. ఈ రోజు వార్తలు చదువుతున్నది’ అంటూ ప్రముఖ న్యూస్ ప్రజెంటర్లు దేవకీ నందన్ పాండే, పమీలా సింగ్, లోతికా రత్నం లాంటి వారు చెబుతుంటే అలా వింటూ ఉండేవాణ్ని. వారి గొంతూ ఎప్పటికీ మర్చిపోలేను” అని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. ”మా అమ్మకు శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉంది. ఆమె ఆల్‌ఇండియా రేడియోలో కార్యక్రమాలు చేసేవారు. అలా నేను బాల్యంలో చాలాసార్లు ముంబయిలోని స్టూడియోకు వెళ్లా. 1974లో దిల్లీకి మారిన తర్వాత ఆకాశవాణికి ఆడిషన్ ఇచ్చా. 19 ఏళ్ల వయసులో న్యూస్ ప్రజెంటర్‌గా చేరా. హిందీ, ఇంగ్లీష్‌లో ప్రోగ్రామ్‌లు చేసేవాణ్ని. నా తొలి ప్రోగ్రామ్ నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజుల్లో పాశ్చాత్య మ్యూజిక్ కార్యక్రమాలకు హోస్ట్‌గా వ్యవహరించా” అని ఆకాశవాణితో తనకున్న అనుబంధాన్ని సీజేఐ పంచుకున్నారు.