దేశ రాజధాని ఢిల్లీలో గత కొన్ని రోజులుగా వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంది. గాలి నాణ్యత సూచీ అధ్వాన స్థితిలో నమోదవుతోంది. మంగళవారం ఉదయం కూడా గాలి నాణ్యత అధ్వానంగా నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ఉదయం 8 గంటల సమయంలో ఢిల్లీలో గాలి నాణ్యత 355గా నమోదైంది. అశోక్ విహార్ వద్ద 367, ద్వారకా సెక్టార్ 8 వద్ద 390, డీటీయూ వద్ద 366, జహంగిరిపురిలో 417, లోధి రోడ్డులో 313, ముండ్కాలో 404, నజఫ్గఢ్లో 355, నరేలాలో 356, ఆనంద్ విహార్‌లో 403, ప్రతాప్‌గంజ్‌లో 371, పూసాలో 320, ఆర్కే పురంలో 365, రోహిణిలో 415, షాదీపూర్‌లో 359, వివేక్ విహార్‌లో ఏక్యూఐ లెవల్స్ 385గా నమోదయ్యాయి.
రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో రాజధాని వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్వాస తీసుకోవడం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిలో కాలుష్య స్థాయిలు ప్రమాదకరంగా మారుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితికి దీర్ఘకాలిక పరిష్కారాన్ని చూపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ‘గత 25 ఏళ్లుగా ఢిల్లీలోనే ఉంటున్నాను. ఇటీవలే కాలంలో రాజధానిలో కాలుష్యం తీవ్రమవుతోంది. ప్రభుత్వం క్రాకర్స్‌పై మాత్రమే ప్రధానంగా దృష్టి పెడుతోంది. అయితే, దీనికి ప్రధాన కారణం సమీప రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడమే’ అని కర్తవ్య పథ్ వద్ద వరుణ్ అనే వ్యక్తి అన్నారు. మరో ఢిల్లీ నివాసి అంకిత్ సచ్‌దేవా మాట్లాడుతూ.. రాజధానిలో సౌకర్యాల కోసం ప్రభుత్వానికి పన్నులు కడుతున్నామన్నారు. అయినప్పటికీ ఈ పరిస్థితి ఉందన్నారు. నగరంలో కాలుష్య నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.