Saturday, December 21, 2024
Homeజాతీయండ్ర‌గ్స్ సొమ్ముతో కాంగ్రెస్‌ ఎన్నిక‌ల్లో పోటీ

డ్ర‌గ్స్ సొమ్ముతో కాంగ్రెస్‌ ఎన్నిక‌ల్లో పోటీ

Date:

డ్రగ్స్‌ సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తోందని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ విమర్శించారు. ఇటీవల ఢిల్లీలో రూ.వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ పట్టివేత కేసులో ఓ కాంగ్రెస్‌ నేత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం మహారాష్ట్రలోని వాసింలో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని ఈ డ్రగ్స్‌ కేసు గురించి ప్రస్తావించారు. యువతను కాంగ్రెస్‌ పార్టీ మాదకద్రవ్యాల వైపు నెట్టి.. ఆ సొమ్ముతో ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని భావిస్తోందని ఆరోపించారు.

కాంగ్రెస్‌ను అర్బన్‌ నక్సల్స్‌ ముఠా పాలిస్తోందని..ఆ పార్టీ ప్రమాదకరమైన అజెండాను ఓడించేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే వ్యక్తులతో కాంగ్రెస్ ఎంత సన్నిహితంగా ఉంటుందో ప్రజలు గమనించాలని అన్నారు. బ్రిటిష్‌ పాలకుల మాదిరిగా కాంగ్రెస్ కూడా దళితులు, వెనుకబడిన వర్గాలు, గిరిజనులను తమతో సమానంగా పరిగణించదని దుయ్యబట్టారు. భారతదేశాన్ని ఎప్పటికీ ఒకే కుటుంబం పాలించాలని వారు భావిస్తారని ఆరోపించారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ స్థానికంగా ఉన్న జగదాంబ మాత ఆలయంలో పూజలు చేశారు. అనంతరం సంత్ సేవా లాల్ మహారాజ్ సమాధి వద్దకు వెళ్లి సంప్రదాయ ఢంకా వాయించారు. బంజారా విరాసత్ మ్యూజియాన్ని ప్రారంభించారు. అంతే కాకుండా ముంబయిలో మొట్టమొదటి భూగర్భ మెట్రో లైన్‌ను ప్రారంభించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 18వ విడత నిధులు విడుదల చేశారు. దీని ద్వారా సుమారు 9.4 కోట్ల మంది రైతులకు సుమారు రూ.20,000 కోట్ల సహాయం అందింది.