Wednesday, January 15, 2025
HomeUncategorizedట్రైనీ ఐఎఎస్ పూజా ఖేడ్క‌ర్‌పై కేసు

ట్రైనీ ఐఎఎస్ పూజా ఖేడ్క‌ర్‌పై కేసు

Date:

ట్రైనీ ఐఎఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్‌పై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసు నమోదు చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేసేలా చర్యలు తీసుకుంది. ఇక ముందు ఆమె సివిల్స్ రాయకుండా డిబార్ చేయాలని ఆదేశించింది. ఆమెకు షోకాజ్ నోటీసులను సైతం అందజేసింది. ప్రొెబేషన్ పీరియడ్‌లో ఉన్నప్పుడు అత్యంత ఖరీదైన ఆడి కార్ కోసం డిమాండ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా దానికి రెడ్ సిగ్నల్ బల్బ్‌ను ఏర్పాటు చేయాలంటూ పట్టుబట్టటం వంటి కారణాలతో కొద్దిరోజులుగా ఆమె వార్తల్లో నిలుస్తోన్నారు. తాజాగా సివిల్స్ పరీక్షల్లో కూడా ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది.

తల్లిదండ్రుల పేర్లు, ఫొటోగ్రాఫ్, సంతకం, ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్, అడ్రస్ వంటి గుర్తింపును మానిప్యులేట్ చేసినట్లు యూపీఎస్సీ గుర్తించింది. ఆమెపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌తో సహా పలు చర్యలను చేపట్టినట్లు వెల్లడించింది. పూజా ఖేడ్కర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలంటూ కోరింది. పూజా ఖేడ్కర్ విషయంలో రాజీ పడదలచుకోలేదని, రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన అధికారాలకు కట్టుబడి ఉన్నామని యూపీఎస్సీ తెలిపింది. అన్ని రకాల పరీక్షలు, సివిల్ సర్వీసుల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పవిత్రత, విశ్వసనీయత, సమగ్రతను కాపాడతామని పేర్కొంది. ప్రజలు, అభ్యర్థుల్లో తమపై ఉన్న విశ్వసనీయత చెక్కుచెదరనివ్వబోమని, అందుకే పూజా ఖేడ్కర్ విషయంలో రాజీపడకుండా దర్యాప్తు జరిపించడానికి కట్టుబడి ఉన్నట్లు యూపీఎస్సీ వివరించింది. అంతకుముందు- పూజా ఖేడ్కర్ వ్యవహారంపై మహారాష్ట్ర సాధారణ పరిపాలన మంత్రిత్వ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నితిన్ గాద్రే.. డీఓపీటీకి ఓ నివేదికను సమర్పించారు.