ట్రాఫిక్ జామ్ పరంగా ఆసియాలోనే టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు మొదటిస్థానంలో నిలిచింది. టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ 2023 ప్రకారం.. ఆసియాలోనే అత్యంత రద్దీగా ఉండే టాప్ 10 నగరాల జాబితాలో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ పీక్ అవర్స్‌లో కేవలం 10 కిలోమీటర్ల దూరానికే ఏకంగా 28 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. అంటే ఈ టెక్‌హబ్‌లోని నివాసితులు ఏటా దాదాపు 132 గంటలపాటు ట్రాఫిక్ జామ్‌లోనే చిక్కుకుపోతారు.
అందుకు కారణంగా బెంగళూరులో రద్దీకి తోడు నగరం వేగంగా విస్తరిస్తుండటమే. దక్షిణ, ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా బెంగళూరుకే వెళ్తుంటారు. ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే నివసిస్తుంటారు. దీంతో పట్టణం కూడా బాగా విస్తరిస్తోంది. మరోవైపు ఈ సిలికాన్ సిటీలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పాలకులు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం రావడం లేదు. నగర రోడ్లలో ప్రయాణం నరకయాతంగా మారిపోయింది. ఇక పీక్స్ అవర్స్, హాలిడేస్‌లో ట్రాఫిక్‌ను తప్పించుకోవడం పెద్ద టాస్క్‌గా మారింది.
ఈ జాబితాలో బెంగళూరు తర్వాత పూణె రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ 10 కిలోమీటర్ల దూరానికి 27 నిమిషాల 50 సెకన్ల సమయం పడుతోంది. ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌లోని మనీలా (27 నిమిషాల 20 సెకన్లు) , తైవాన్‌లోని తైచుంగ్ (26 నిమిషాల 50 సెకన్లు), జపాన్‌లోని సప్పోరో (26 నిమిషాల 50 సెకన్లు), జపాన్‌లోని నగోయా (24 నిమిషాల 20 సెకన్లు), ఇండొనేషియాలోని జకార్తా (23 నిమిషాల 20 సెకన్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. టామ్‌టామ్ ట్రాఫిక్ సూచిక 6 ఖండాల్లోని 55 దేశాల్లో ఉన్న 387 నగరాల మీద రీసెర్చ్ చేసి నివేదిక విడుదల చేసింది.