Wednesday, January 15, 2025
HomeUncategorizedజూనియ‌ర్ వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్ కాదు

జూనియ‌ర్ వైద్యురాలిపై గ్యాంగ్‌రేప్ కాదు

Date:

పశ్చిమ బెంగాల్ కోల్‌క‌తాలో జూనియర్ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై కేంద్ర సంస్థ సీబీఐ ముమ్మర దర్యాప్తు చేస్తోంది. ఆ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని తన విచారణలో సీబీఐ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిందితుడు సంజయ్‌రాయ్‌ ఒక్కడే ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధరించినట్లు పేర్కొన్నాయి. అలాగే దర్యాప్తు తుదిదశకు చేరుకుందని, త్వరలో కోర్టులో అభియోగాలు దాఖలు చేయనుందని తెలిపాయి.

తొలుత ఈ కేసును బెంగాల్‌ పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే ఆ విచారణపై అనుమానాలు వ్యక్తంకావడంతో కోల్‌కతా హైకోర్టు ఆ కేసును సీబీఐకి బదిలీ చేసింది. ”కేసు పూర్తిచేయడానికి నేను ఐదు రోజుల సమయం అడిగాను. కానీ దానిని సీబీఐకి బదిలీ చేశారు. రోజులు గడుస్తున్నా న్యాయం మాత్రం లభించడం లేదు. అలాగే కేసు పురోగతి గురించి ఎలాంటి వివరాలు ఇవ్వడం లేదు” అంటూ మమత విమర్శలు చేస్తోన్న తరుణంలో తాజా వార్తలు వచ్చాయి. ఆర్జీ కర్‌ ఆసుపత్రిలోని సెమినార్ రూమ్‌లో ఆగస్టు 9న పీజీ వైద్య విద్యార్థి విగత జీవిగా కనిపించి ఉండటాన్ని గుర్తించారు. తొలుత ఆత్మహత్య చేసుకుందని అధికారులు చెప్పినప్పటికీ.. అత్యాచారమని దర్యాప్తులో తేలింది. వాలంటీర్‌గా పనిచేస్తున్న సంజయ్‌రాయ్‌ను ఈ కేసులో పోలీసులు ఘటన జరిగిన మరుసటి రోజే అరెస్టు చేశారు. అతడి మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకొని పరిశీలించగా.. పలు అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.

సంజయ్ రాయ్‌ను సీబీఐ విచారించిన సందర్భంగా అతడి ప్రవర్తన గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ”సంజయ్‌ రాయ్‌లో పశ్చాత్తాపం లేదు. ప్రతి నిమిషం చోటుచేసుకున్న విషయాలను గుక్కతిప్పకుండా మొత్తం ఎపిసోడ్‌ను వివరించాడు. దాన్నిబట్టి చూస్తే అతనికి ఎటువంటి పశ్చాత్తాపం లేనట్లు కనిపించింది. అయితే, నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలున్నాయి. ఆగస్టు 8 ఉదయం 11 గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో రాయ్‌ కనిపించాడు. ఆగస్టు 9 తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే బిల్డింగులోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది” అని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సీబీఐ అధికారి గతంలో వెల్లడించారు.