చిన్నారులకు సంబంధించిన పోర్న్ వీడియోలను డౌన్ లోడ్ చేయడం కానీ, వీక్షించడం కానీ.. పోక్సో చట్టం కిందకు వస్తాయని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నారులపై లైంగిక వేధింపులను అడ్డుకునే చట్టానికి సంబంధించిన విషయంలో సుప్రీం ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. చైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్‌లోడ్ చేయడం కానీ, వీక్షించడం కానీ పోక్సో నేరం కాదు అని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ తీర్పును ఇవ్వడంలో మద్రాసు కోర్టు తీవ్రమైన తప్పు చేసినట్లు సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.
28 ఏళ్ల ఓ వ్యక్తి చైల్డ్ పోర్న్ వీడియోలను తన మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసిన కేసులో మద్రాసు హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది. ఆ వ్యక్తిపై నేరాభియోగాన్ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు రిస్టోర్ చేసింది. ఆ వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సుప్రీం తన ఆదేశంలో పేర్కొన్నది.