Thursday, November 14, 2024
Homeజాతీయంఖ‌ర్గే ఆయ‌న కుటుంబ త్యాగాన్ని మ‌రిచిపోయారు

ఖ‌ర్గే ఆయ‌న కుటుంబ త్యాగాన్ని మ‌రిచిపోయారు

Date:

కేవలం ఓట్ల కోసం ఆయన కుటుంబ త్యాగాన్ని మర్చిపోయారంటూ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. కాంగ్రెస్‌ నేతపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఖర్గే బాల్యంలో జరిగిన ఓ విషాద సంఘటనను గుర్తు చేస్తూ.. యోగి విమర్శలు గుప్పించారు. ”భారత్‌లో బ్రిటీష్‌ వారి పాలన కొనసాగుతున్న సమయంలో హైదరాబాద్‌ సంస్థానం నిజాం పాలనలో ఉండేదన్న సంగతి తెలిసిందే. ఖర్గే కుటుంబం నివసించిన గ్రామం కూడా నిజాం ఆధీనంలో ఉండేది. నాడు హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో ఆయన ఇల్లు కాలిపోయింది. ఖర్గే తల్లి సహా కుటుంబ సభ్యులంతా ప్రాణాలు కోల్పోయారు” అని యోగి తెలిపారు.

”ఈ సంఘటన ఖర్గేకు కచ్చితంగా గుర్తుకు ఉంటుంది. కానీ, ఈ విషయం గురించి ఆయన మాట్లాడరు. ఎందుకంటే.. ఈ ఘటనను ప్రస్తావిస్తే ఓ వర్గం ఓట్లకు కాంగ్రెస్‌ దూరం అవుతుంది. అందుకే ఆయన దాని గురించి ఏం మాట్లాడరు. ఓట్ల కోసం తన కుటుంబం చేసిన త్యాగాన్ని మర్చిపోయారు” అంటూ విమర్శలు చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు సాధువుల వేషధారణలో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారని.. కొందరు ముఖ్యమంత్రి బాధ్యతలు కూడా తీసుకున్నరాంటూ వ్యాఖ్యానించారు. దీనిపై తాజాగా స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడిపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా.. నవంబరు 20న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 23న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.