దేశంలో వివిధ పోటీ పరీక్షలకు కోచింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కోచింగ్ కేంద్రాలు చేసే 100 శాతం జాబ్ గ్యారెంటీ, 100 శాతం సెలెక్షన్ వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థకు అనేక ఫిర్యాదులు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
”తమ సక్సెస్ రేటు, సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు తీసుకున్న కోర్సులు మొదలైన విషయాల గురించి కోచింగ్ సెంటర్లు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుంచి కొంత సమాచారాన్ని దాస్తుండడం మేము గమనించాము. అందువల్ల వాటి నిర్వాహకుల కోసం పలు మార్గదర్శకాలు రూపొందించాము” అని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు. కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, అయితే ప్రకటనలనేవి వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదని ఆమె అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటికి ఇప్పటికే జరిమానాలు విధించామని తెలిపారు. ప్రస్తుతం కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి వినియోగదారుల రక్షణ చట్టం కింద పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు.