తమిళనాడులోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగికదాడి ఘటనను నిరసిస్తూ తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కే అన్నామలై కోయంబత్తూరులోని తన ఇంటి ముందు కొరడాతో ఆరు దెబ్బలు కొట్టుకున్నారు. శనివారం నుంచి 48 రోజులపాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు తెలిపారు. డీఎంకే పాలనలో రాష్ట్రంలో అడుగడుగునా అన్యాయమే జరుగుతున్నదని అన్నామలై ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాయాలను నిరసిస్తూ తమను తాము కొరడాలతో కొట్టుకోవడం, తమను తాము శిక్షించుకోవడం అనేది తమిళనాడు సంస్కృతిలో భాగంగా ఉన్నదని ఆయన అన్నారు. పూర్వకాలం నుంచి ఉన్న సంప్రదాయాన్నే తాను ఇప్పుడు పాటించానని చెప్పారు. తన నిరసన ఏ వ్యక్తికి వ్యతిరేకం కాదని చెప్పారు.
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగానే తాను నిరసన తెలియజేస్తున్నానని అన్నామలై వెల్లడించారు. అన్నా యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఘటన అలాంటి అన్యాయాల్లో ఒకటని చెప్పారు. డీఎంకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సామాన్యులకు వ్యతిరేకంగా అన్యాయాలు జరుగుతూనే ఉన్నాయని అన్నామలై తెలిపారు. మహిళలు, పిల్లలు అన్యాయాలకు గురవుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో అవినీతి కూడా పెరిగిపోయిందని అన్నామలై విమర్శించారు.