Monday, January 6, 2025
Homeజాతీయంకుంభ‌మేళాకు భారీగా న‌డవ‌నున్న రైళ్లు

కుంభ‌మేళాకు భారీగా న‌డవ‌నున్న రైళ్లు

Date:

వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో జ‌రగ‌నున్న మహా కుంభమేళా కోసం భారతీయ రైల్వే భారీగా రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు సిద్దం చేస్తోంది. దాదాపు 45 రోజుల పాటు 34వేల రైళ్లను అందుబాటులోకి తీసురానున్నది. మహా కుంభం జనవరి 13న పుష్య పౌర్ణిమ రోజున మొదలై.. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. కుంభమేళా సందర్భంగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ఆయన మాట్లాడారు. ప్రయాగ్‌రాజ్‌ మహాకుంభ మేళా కోసం నాలుగు రింగ్‌ రైల్‌ సర్కిల్స్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. వీటిలో వారణాసి-ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్-అయోధ్య, అయోధ్య-కాశీ, ప్రయాగ్‌రాజ్ సర్కిల్‌ను ఏర్పాటు చేశామన్నారు. దేశంలోని 50 నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని తెలిపారు. ప్రయాగ్‌రాజ్‌కు నేరుగా కనెక్టివిటీ ఉంటుందని అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు.

చెన్నై, ముంబయి సహా 50 నగరాల నుంచి ప్రయాగ్‌రాజ్‌కు రిజర్వ్‌ చేయబడిన రైళ్లు నడుస్తాయన్నారు. కుంభమేళాకు ఈ సారి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా స్టేషన్‌లో కలర్‌ కోడింగ్‌ ఏర్పాటు చేశారు. ఇదే విధానాన్ని కుంభమేళాలో ఏర్పాటు చేయనున్నారు. కలర్‌ కోడ్‌ ద్వారా ప్రయాణికులు నిర్దేశించిన ప్లాట్‌ఫారమ్‌ చేరుకుంటారు. ప్రయాణికుల షెల్టర్లు నాలుగు వేర్వేరు రంగుల్లో ఉంటాయి. ఓ ప్రయాణికుడు లక్నోకు వెళ్లాల్సి వస్తే.. అతను నీలం రంగు షెల్టర్‌ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ప్రయాణీకుల టికెట్ సైతం నీలిరంగులోనే ఉంటుంది. షెల్టర్ నుంచి ప్లాట్‌ఫారమ్‌కు వెళ్లే మార్గంలో బ్లూ కలర్ ఇండికేటర్స్‌ని అమరుస్తారు. సంగం సిటీలో మొత్తం 23 ప్యాసింజర్‌ షెల్టర్స్‌ను నిర్మించినట్లు అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. అన్ని స్టేషన్లలోని షెల్టర్, వెయిటింగ్ రూమ్‌ల వద్ద, రైల్వే ఉద్యోగులు మొబైల్ టికెటింగ్ మెషీన్ల ద్వారా ప్రయాణీకులకు టికెట్లు అందిస్తారన్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా సాధారణ టికెట్లు పొందే అవకాశం ఉంటుందన్నారు. 554 అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఇక 18వేల మంది ఆర్పీఎఫ్‌, జీఆర్పీ జవాన్లను మోహరించనున్నారు. అదే సమయంలో దేశం నలుమూలల నుంచి వివిధ జోన్లకు చెందిన 13వేల మంది రైల్వే అధికారులు, ఉద్యోగులను ప్రయాగ్‌రాజ్‌కు రప్పిస్తున్నారు.