Wednesday, January 15, 2025
HomeUncategorizedకల్తీపాల వ్యాపారం ఈ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ

కల్తీపాల వ్యాపారం ఈ మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ

Date:

గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కల్తీ పాల విక్రయాలపై అత్యధిక కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఇంకా దేశంలో కల్తీ పాల వ్యాపారం కొనసాగుతూనే ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ పార్లమెంట్‌లో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. గడిచిన మూడేళ్లలో యూపీ, కేరళ, తమిళనాడులో ఎక్కువగా కల్తీ పాల విక్రయం కేసులు నమోదైనట్లు పేర్కొంది. 2023-24లో యూపీలో 16వేలకుపైగా నమూనాలను పరిశీలించగా నమూనాలు పాజిటివ్‌గా వచ్చాయి. ఆయా నమూనాలు ప్రమాణాలకు అనుగుణంగా లేవు. తమిళనాడులో 2,200పైగా కేసులు నమోదయ్యాయి. ఇక కేరళలో 1,300 కేసులు రికార్డయ్యాయి.

2022-23, 2021-22 సంవత్సరాల్లోనూ ఈ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కల్తీ పాల కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు బిహార్‌, హర్యానా, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌, మధ్యప్రదేశ్‌లోనూ కల్తీ పాలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని ఐదు రాష్ట్రాలు మాత్రమే 52 శాతం పాలను ఉత్పత్తి చేస్తున్నాయి. నాబార్డ్ డేటా ప్రకారం.. ఆ రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. పాల ఉత్పత్తిలో రాజస్థాన్ దేశంలోని ముందువరుసలో ఉన్నది. ఇక్కడ పశుపోషణ ఎక్కువగా ఉండడంతో పాల ఉత్పత్తి సైతం ఎక్కువగా జరుగుతున్నది. 2023 సంవత్సరానికి సంబంధించిన నాబార్డ్‌ డేటా ప్రకారం.. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం పాలలో 15.05శాతం రాజస్థాన్ ఉత్పత్తి చేస్తుంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉన్నది. యూపీలో 14.93 శాతం పాల ఉత్పత్తి జరుగుతున్నది. 8.06 శాతం పాల ఉత్పత్తిలో మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత గుజరాత్‌, ఏపీ నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.