Saturday, November 16, 2024
Homeజాతీయంఉగ్ర‌వాదులు మ‌న‌ల్ని భ‌య‌పెట్ట‌లేరు

ఉగ్ర‌వాదులు మ‌న‌ల్ని భ‌య‌పెట్ట‌లేరు

Date:

దేశంలోని గ‌త ప్ర‌భుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పాలసీలు తీసుకొచ్చాయని ప్రధాని మోడీ విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. శనివారం జరిగిన హిందుస్థాన్‌ టైమ్స్‌ లీడర్‌షిప్‌ సదస్సులో ప్రధాని కీలక ప్రసంగం చేశారు. ఈసందర్భంగా ఉగ్రవాదం, తదితర అంశాలను ప్రస్తావించారు. సదస్సు ప్రాంగణంలో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్ల కథనాలను మోదీ వీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ”ఆ సమయంలో భారత ప్రజలు సురక్షితంగా లేరని చెప్పేందుకు కొందరు ఉగ్రవాదాన్ని ఉపయోగించేవారు. కానీ కాలం మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు వారి సొంతగడ్డపైనే అభద్రతాభావంతో ఉంటున్నారు. భయంభయంగా బతుకుతున్నారు. ఇక, వారు మనల్ని భయపెట్టలేరు” అని మోడీ అన్నారు.

ఈసందర్భంగా విపక్షాలపై మోడీ విమర్శల వర్షం కురిపించారు. ”ఇప్పుడు ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ, ఈ దేశ ప్రజలు మమ్మల్ని నమ్మి మూడోసారి అవకాశమిచ్చారు. గత ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పాలసీలను తీసుకొచ్చాయి. ఆ పరిస్థితిని మేం పోగొట్టాం. ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాం. మా విధానాలతో ప్రజలను ఆశావహ దృక్పథం వైపు నడిపిస్తున్నాం. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే అనే మంత్రంతో మా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ప్రజల కోసం ఎక్కువగా ఖర్చు చేయాలి. ప్రజల కోసం ఎక్కువగా పొదుపు చేయాలనేదే మా విధానం” అని మోదీ వివరించారు.