Wednesday, December 25, 2024
Homeజాతీయంఉగ్ర‌వాదాన్ని నిర్మూలిస్తేనే స‌హకారం

ఉగ్ర‌వాదాన్ని నిర్మూలిస్తేనే స‌హకారం

Date:

ఉగ్ర‌వాదాన్ని నిర్మూలిస్తేనే స‌హ‌కారం ఉంటుంద‌ని భార‌త విదేశాంగ మంత్రి జై శంక‌ర్ అన్నారు. ఇస్లామాబాద్‌లో జ‌రుగుతున్న షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌ద‌స్సులో ఆయ‌న పాల్గొన్నారు. మంగ‌ళ‌వారం రాత్రి పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ ఇచ్చిన విందుకు ఆయ‌న హాజ‌రయ్యారు. బుధ‌వారం జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఉగ్ర‌వాదాన్ని నిర్మూలించ‌కుండా రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారం కుద‌ర‌దు అని మంత్రి జైశంక‌ర్ తెలిపారు. వాణిజ్యం, ఎన‌ర్జీ, క‌నెక్టివిటీ లాంటి రంగాల్లో స‌హ‌కారం కొన‌సాగాలంటే, సీమాంత‌ర ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం, వేర్పాటువాదం ఆగిపోవాల‌న్నారు. ఎస్సీవో స‌ద‌స్సులో ఆయ‌న ప్ర‌సంగిస్తూ సంయుక్త గౌర‌వం, స‌మాన‌త్వం మ‌ధ్య స‌హ‌కారం జ‌ర‌గాల‌న్నారు. ప్రాంతీయ స‌మ‌గ్ర‌త‌, సౌభ్రాతృత్వాన్ని దేశాలు గుర్తించాల‌న్నారు. పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ నేతృత్వంలో ఎస్సీవో మీటింగ్ జ‌రుగుతోంది. ఎస్సీవో స‌భ్య దేశాల మ‌ధ్య న‌మ్మ‌కం ఉంటే స‌హ‌కారం లాభ‌దాయకంగా ఉంటుంద‌న్నారు. గ్రూపులో ఉన్న దేశాలు ఒక్క‌టిగా ముందుకు వెళ్లాల‌న్నారు. ఏక‌ప‌క్షంగా కాకుండా, చాలా నిస్వార్థ‌పూరిత భాగ‌స్వామ్యాల‌ను ఏర్పాటు చేసుకోవాల‌న్నారు. స‌రిహ‌ద్దుల వ‌ద్ద ఉగ్ర‌వాదం, తీవ్ర‌వాదం లాంటి కార్య‌క‌లాపాలు పెరిగితే, అప్పుడు వాణిజ్యం, ప్ర‌జా ర‌వాణాకు ఆటంకాలు ఎదుర‌వుతాయ‌ని జైశంక‌ర్ చెప్పారు