దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమబెంగాల్ కోల్‌కతా ఆర్‌జీకార్ వైద్య కళాశాల ట్రెయినీ డాక్టర్‌పై లైంగిక దాడి, హత్య కేసులో కోల్‌కతా కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరెస్టయిన సంజయ్ రాయ్‌ను న్యాయస్థానం శనివారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా అతడికి కోల్‌కతాలోని సీల్దా కోర్టు శిక్ష ఖరారు చేసింది. దోషి సంజయ్ రాయ్‌కి జీవితఖైదు విధించింది. అతడికి రూ.50 వేలు జరిమానా కూడా విధించింది. అంతేకాదు బాధిత కుటుంబానికి రూ.17లక్షల పరిహారం ఇవ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషికి మరణశిక్ష విధించాలంటూ వైద్యురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
2024 ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జీకార్ ఆసుపత్రిలో సెమినార్ రూమ్‌లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కాగా ఆర్‌జీకార్ దవాఖాన డాక్టర్లు, వైద్య విద్యార్థులు సుదీర్ఘకాలం ఆందోళనలు నిర్వహించారు. ఘటన అనంతరం ఆసుపత్రి ఆవరణలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సంజయ్‌ను ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును సీబీఐ విచారించింది. ప్రధాన నిందితుడిగా సంజయ్ రాయ్ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చి కోర్టుకు సమర్పించింది. దీనిపై గత వారం విచారణ జరిపిన కోల్‌కతాలోని సీల్దా కోర్టు.. సంజయ్ రాయ్‌ని దోషిగా నిర్ధారించింది. ఈ మేరకు ఇవాళ దోషికి శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.