ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారసులు ప్రస్తుతం ఆటో డ్రైవర్లుగా జీవిస్తున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది దేవుడు విధించిన న్యాయమని అన్నారు. శుక్రవారం అయోధ్యలోని అసర్ఫీ భవన్ పీఠ్ వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. ‘ఔరంగజేబు వారసులు కోల్‌కతా సమీపంలో నివసిస్తున్నారని, ఆటో కార్మికులుగా జీవనోపాధి పొందుతున్నారని కొందరు నాకు చెప్పారు. దేవాలయాలు, మతపరమైన ప్రదేశాలపై విధ్వంసక చర్యలకు ఔరంగజేబు పాల్పడ్డాడు. దైవత్వాన్ని ధిక్కరించకపోతే అతడి వారసులు అటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఉండకపోవచ్చు’ అని అన్నారు.
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై యోగి ఆదిత్యనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందువులు ఎదుర్కొంటున్న సవాళ్లకు ఇది నిదర్శనమని అన్నారు. సనాతన ధర్మం, విలువలను కాపాడాలని సమాజాన్ని ఆయన కోరారు.