Monday, September 30, 2024
Homeజాతీయంఅస్సాం ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హాం

అస్సాం ప్ర‌భుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హాం

Date:

అస్సాం ప్ర‌భుత్వం బుల్డోజర్‌తో ఇళ్లను కూల్చడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. బుల్డోజర్‌ చర్యలపై సుప్రీంకోర్టు సెప్టెంబర్‌ 17న ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు న్యాయపరమైన అనుమతి లేకుండా కూల్చివేతలను దేశవ్యాప్తంగా నిషేధించింది. అయితే రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, నీటి వనరుల ఆక్రమణలకు సంబంధించిన కేసులకు మినహాయింపు ఇచ్చింది.

అస్సాం కమ్రూప్ జిల్లా కచుటోలి పత్తర్ గ్రామం పరిధిలో గిరిజన భూమిని ఆక్రమించి నిర్మించిన 47 ఇళ్లను అధికారులు ఇటీవల కూల్చివేశారు. ఈ నేపథ్యంలో కోర్టు అనుమతి లేకుండా ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారని 47 మంది నివాసితులు ఆరోపిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్లు పరిష్కరించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని అస్సాం అడ్వకేట్ జనరల్ సెప్టెంబరు 20న గౌహతి హైకోర్టుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలాగే భూ యజమానులతో ఒప్పందాలు చేసుకుని దశాబ్దాలుగా తాము అక్కడ నివసిస్తున్నామని, చట్టపరమైన నిబంధనలను తాము ఉల్లంఘించలేదని పిటిషనర్లు వాదించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బీఆర్ గవాయి, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపింది. అస్సాం ప్రభుత్వానికి కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆ రాష్ట్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వరకు యథాతథ స్థితిని కొనసాగించాలని పేర్కొంది.