Wednesday, January 15, 2025
HomeUncategorizedఅమ్మాయిలు, అబ్బాయిలు యథేచ్ఛగా మాట్లాడుకోవడం వల్లే రేప్‌లు

అమ్మాయిలు, అబ్బాయిలు యథేచ్ఛగా మాట్లాడుకోవడం వల్లే రేప్‌లు

Date:

ప‌శ్చిమ బెంగాల్ కోల్‌క‌త్తాలో జ‌రిగిన జూనియర్‌ వైద్యురాలిపై అత్యాచార ఘటన ఆ రాష్ట్ర‌ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వేళ అత్యాచారాలపై బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తాజాగా వైరల్‌గా మారాయి. అమ్మాయిలు, అబ్బాయిలు యథేచ్ఛగా మాట్లాడుకోవడం వల్లే రేప్‌ కేసులు పెరుగుతున్నాయంటూ నాడు ఆమె వ్యాఖ్యలు చేయడం సంచ‌ల‌నంగా మారింది.

2012లో కోల్‌కతాలోని పార్క్‌ స్ట్రీట్‌ ప్రాంతంలో ఓ యువతి కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి గురైంది. ఇది అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై నాడు దీదీ స్పందిస్తూ.. ”ఈ కాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు స్వేచ్ఛగా మాట్లాడుకోవడం పెరుగుతోంది. గతంలో అమ్మాయి, అబ్బాయి ఒకరినొకరు చేయి పట్టుకుని కన్పిస్తే వారిని పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించేవారు. తల్లిదండ్రులు వారిని మందలించి సరిదిద్దేవారు. కానీ ఇప్పుడు అంతా ఓపెన్‌ అయిపోయింది. ఓపెన్‌ మార్కెట్‌ మాదిరిగా యువతకు అవకాశాలు ఉంటున్నాయి” అని వ్యాఖ్యానించారు. ఇది అప్పట్లో తీవ్ర దుమారం రేపడంతో దీదీ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు. తాజాగా కోల్‌కతా అత్యాచార ఘటన వేళ నాటి మమతా బెనర్జీ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి సీఎం హయాంలో న్యాయం దక్కుతుందని ఆశిస్తున్నారా? అంటూ కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.