Friday, January 10, 2025
Homeజాతీయంఅభివృద్ది అడ్డుకోవ‌డంలో పిహెచ్‌డీ చేశాయి

అభివృద్ది అడ్డుకోవ‌డంలో పిహెచ్‌డీ చేశాయి

Date:

అభివృద్ధిని అడ్డుకోవడంలో ప్ర‌తిప‌క్షాలు పీహెచ్‌డీ చేశారంటూ ప్ర‌తిప‌క్షాల‌పై ప్ర‌ధాని మోడీ మ‌రోసారి విరుచుకుప‌డ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రాపుర్‌లో నిర్వహించిన సభలో ఆయ‌న మాట్లాడారు. భాజపా,శివసేన, ఎన్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మహారాష్ట్ర గత రెండున్నరేళ్లలో డబుల్‌ స్పీడ్‌తో అభివృద్ధి చెందిందన్నారు. అయితే.. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ”రెండున్నర ఏళ్లలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందడాన్ని ప్రజలంతా చూశారు. అత్యధిక విదేశీ పెట్టుబడులున్న రాష్ట్రం మహారాష్ట్ర. ఈ గడ్డపై 12 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. 100 రైల్వేస్టేషన్లను ఆధునికీకరించాం. నూతన విమానాశ్రయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి” అని పేర్కొన్నారు.

”ఈ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌ డబుల్‌ పీహెడీ చేసింది. ఆదివాసీ కమ్యూనిటీని విచ్ఛిన్నం చేయాలని ఆ పార్టీ కోరుకుంటోంది. మీ ఐక్యతను నాశనం చేయాలని యత్నిస్తోంది. కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌ గాంధీని ఉద్దేశిస్తూ) విదేశాల్లోనూ ఇదే విషయం చెబుతున్నారు. హస్తం పార్టీ కుట్రను భగ్నం చేసేందుకు మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది” అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.