Thursday, December 26, 2024
Homeజాతీయంఅధికారులు జ‌డ్జిలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు

అధికారులు జ‌డ్జిలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు

Date:

ప్ర‌భుత్వ‌ అధికారులు ఒక వ్యక్తి దోషి అని తేల్చి చెప్పలేరని, జడ్జిలా వ్యవహరించి నిందితుల స్థిరాస్తులను కూల్చివేయడం తగదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రాలు, ఆయా ప్రభుత్వాల అధికారులు మితిమీరి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే ధిక్కార చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ధర్మాసనం హెచ్చరించింది. కూల్చివేత ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, ఆ ఆస్తి పునరుద్ధరణకు సంబంధించిన పరిహారాన్ని అధికారుల జీతం నుంచి వసూలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది.

”కార్యనిర్వాహక అధికారి ఒక వ్యక్తిని దోషిగా ప్రకటించలేరు. ఆ అధికారి న్యాయమూర్తిగా మారి, నిందితుల ఆస్తులను కూల్చివేయాలని నిర్ణయం తీసుకోలేరు. రాష్ట్రాల ఏకపక్ష చర్యల నుంచి పౌర హక్కులకు రాజ్యాంగం రక్షణ కల్పిస్తుంది. ఒక సామాన్య పౌరుడి ఇంటి నిర్మాణంలో అతడి ఎన్నో ఏళ్ల శ్రమ, కలలు కలగలిసి ఉంటాయి. దానిలో వారి భవిష్యత్తు, భద్రత ఇమిడి ఉంటుంది. ఆ ఇంట్లో ఒక్కరే నిందితుడు అయినప్పుడు.. అందులో నివసించే మిగతా వ్యక్తులకు ఆశ్రయం లేకుండా ఎలా చేస్తారు..?అలాగే అక్రమకట్టడాల తొలగింపు కోసం ఇంటి యజమానికి 15 రోజుల గడువు ఇవ్వాలి. అంతేగాకుండా మూడు నెలల్లో మున్సిపల్ అధికారులు ఒక డిజిటల్‌ పోర్టల్‌ను సిద్ధం చేయాలి. ఇప్పటివరకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు, అక్రమ నిర్మాణాలపై తుది ఉత్తర్వులకు సంబంధించిన వివరాలు అందులో పొందుపరచాలి” అని జస్టిస్ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది.