ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడంతో పాటు దేశంలోనూ పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలనే సంకల్పంతో ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన అతి పెద్ద పాఠశాలను నిర్మించారు. సరికొత్త హంగులతో సుందర్ నగరిలో ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ పాఠశాలను దిల్లీ సీఎం ఆతిశీ గురువారం ప్రారంభించారు.
బాలల దినోత్సవం రోజున ఈ అద్భుతమైన ప్రపంచస్థాయి పాఠశాలను విద్యార్థులకు అంకితం చేయడంపై సీఎం ఆతిశీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆమె పాఠశాల ఫొటోలను పోస్టు చేశారు. భూ మాఫియా నుంచి స్వాధీనం చేసుకున్న స్థలంలో ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో రద్దీ ప్రదేశంలో నిర్మించిన ఈ నూతన పాఠశాల 7వేల మందికి పైగా పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. అత్యాధునిక వసతులతో కూడిన ఈ స్కూల్‌లో 131 గదులు, 7 ల్యాబ్‌లు, లైబ్రరీ, లెక్చర్ హాలు, లిఫ్ట్ వంటి సౌకర్యాలు కూడా ఉన్నట్లు ఆతిశీ వెల్లడించారు. ఇలాంటి ప్రభుత్వ పాఠశాలను అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే నిర్మించగలరని దిల్లీ ప్రజలకు తెలుసన్న సీఎం ఆతిశీ.. మరోసారి విద్యా రంగంపై కృషిచేసే ప్రభుత్వాన్నే ప్రజలు ఎన్నుకొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.