Thursday, October 31, 2024
HomeUncategorizedసేవ పేరుతో పేద విద్యార్థుల దోపిడి

సేవ పేరుతో పేద విద్యార్థుల దోపిడి

Date:

తెలంగాణలోని కొన్ని సంస్థలకు విదేశాల నుంచి వచ్చిన విరాళాలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో సోదాలు జరిపిన ఈడీ.. ఆపరేషన్ మొబిలిటి(ఓమ్‌)పై మనీలాండరింగ్‌ చట్టం కింద కేసు నమోదు చేసింది. తెలంగాణ సీఐడీలో నమోదైన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఈడీ అధికారులు మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు. ఓమ్‌ సహా ఇతర సంస్థల పేరుతో విదేశాలకు చెందిన దాతల నుంచి రూ.300 కోట్లు సేకరించినట్లు ఈడీ పేర్కొంది.

యూఎస్‌, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, డెన్మార్క్‌, జర్మనీ, బ్రెజిల్‌, ఫిన్‌లాండ్‌, ఐర్లాండ్‌, మలేసియా, రుమేనియా, సింగపూర్‌, నార్వే సహా పలు దేశాల నుంచి నిధులు సేకరించినట్టు తెలిపింది. తాము నిర్వహిస్తోన్న సుమారు 100 పాఠశాలల్లో చదువుతున్న ఎస్సీ, అనాథ పిల్లలకు సౌకర్యాలు కల్పిస్తామని ఈ విరాళాలు సేకరించినట్టు గుర్తించారు. విరాళాలను పక్కదారి పట్టించిన సదరు సంస్థ.. పాఠశాలల్లోని విద్యార్థుల వద్ద రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్టు సీఐడీ అధికారులు గతంలో గుర్తించారు. విరాళాల ద్వారా ఓమ్‌ సంస్థ తెలంగాణ, గోవా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలో ఆస్తులు కొనుగోలు చేసినట్టు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లో 11 చోట్ల రెండ్రోజుల పాటు సోదాలు చేసిన ఈడీ అధికారులు.. ఆస్తులకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, బినామీ కంపెనీల లావాదేవీల వివరాలు, డిజిటల్‌ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.