ఇటీవల ఐపీఎస్ మనోజ్ కుమార్ శర్మ జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించిన చిత్రం ’12th ఫెయిల్. ఈ చిత్రంలో విక్రాంత్ మస్సే, మేధా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ కోసం సుప్రీంకోర్టులో దీనిని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులతోపాటు దాదాపు 600 మంది సుప్రీంకోర్టు అధికారులు, వారి కుటుంబసభ్యులు, చిత్రబృందం పాల్గొన్నారు. సినిమా వీక్షించిన అనంతరం సీజేఐ చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. ఇది స్ఫూర్తిదాయకమైన చిత్రమన్నారు.
”చుట్టూ ఉన్న ప్రజల కోసం ఏదైనా చేసేలా ఇలాంటి చిత్రాలు అందరిలో స్ఫూర్తి నింపుతాయి. విక్రాంత్, మేధా శంకర్ అద్భుతంగా నటించారు. ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలకు నా కళ్లు చెమర్చాయి. ఆశ.. అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది. నా తోటివారు, సిబ్బంది అందరి తరఫున టీమ్‌కు ధన్యవాదాలు” అని సీజేఐ ప్రశంసలు కురిపించారు. సీజేఐ మాటలకు దర్శకుడు విదు వినోద్ చోప్రా ఆనందం వ్యక్తం చేశారు. ”నా జీవితంలో ఇవి ఎంతో అందమైన క్షణాలు. సీజేఐతో కలిసి దీనిని వీక్షించడం సంతోషంగా ఉంది. ఐదేళ్లు శ్రమించి దీనిని తెరకెక్కించా. ఆయన మాటలతో నా శ్రమకు విలువ దక్కినట్లు అనిపించింది” అని తెలిపారు.