Thursday, October 31, 2024
HomeUncategorizedసిబిఐ చేతికి నీట్ లీకేజీ కేసు

సిబిఐ చేతికి నీట్ లీకేజీ కేసు

Date:

నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ అంశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నిర్వహించిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో దీనిపై దర్యాప్తు చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు సీబీఐ ఆదివారం కేసు నమోదు చేసింది. నీట్‌ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు వస్తోన్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారించనుంది. అలాగే, బిహార్‌లో పేపర్‌ లీక్‌, పలుచోట్ల విద్యార్థులు సమయం కోల్పోయారంటూ వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటి అంశాలపైనా సమగ్రంగా విచారించనుంది.

కేంద్ర విద్యాశాఖ సూచనల మేరకు నమోదు చేసిన ఈ కేసులో నిందితులుగా గుర్తు తెలియని వ్యక్తులను చేర్చినట్లు సీబీఐ తెలిపింది. దేశవ్యాప్తంగా దాదాపు 24లక్షల మంది విద్యార్థులు రాసిన ఈ పరీక్షలో అక్రమాలు, మోసాలు జరిగాయని పలుచోట్ల కేసులు నమోదైనట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం పరీక్షల ప్రక్రియలో పారదర్శకత కోసం ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సదరు అధికారి వెల్లడించారు.