పురుషుడితో చాలాకాలంపాటు సహజీవనం చేసిన మహిళ.. విడిపోయిన సమయంలో భరణం పొందేందుకు అర్హురాలని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. చట్టబద్దంగా ఇరువురు వివాహం చేసుకోకపోయినా ఇది వర్తిస్తుందని పేర్కొంది. గతంలో సహజీవనం చేసిన భాగస్వామికి భరణం ఇవ్వాలంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. మహిళకు నెలసరి భత్యం కింద 1,500 చెల్లించాలంటూ కింద కోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది.
శైలేష్ బోప్చే(38), అనితా బోప్చే (48) అనే మహిళతో కొంతకాలం సహజీవనం చేశారు. వీరికి ఓ బిడ్డ కూడా జన్మించింది. బాలాఘాట్‌కి చెందిన శైలేష్ బోప్చే.. సదరు మహిళ ఆరోపణలపై ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన భార్యగా చెప్పుకుంటున్న మహిళ, ఆలయంలో వివాహం చేసుకున్నట్లు రుజువు చేయలేకపోయిందని బోప్చే కోర్టుకు చెప్పాడు. ఈ కేసులో మహిళ చట్టబద్ధంగా అతని భార్య కాదని.. సీఆర్పీసీలోని సెక్షన్ 125 కింద మెయింటనెన్స్ మొత్తాన్ని డిమాండ్ చేయలేదని బోప్చే తరుపు న్యాయవాది వాదనల్ని వినిపించారు. జస్టిస్ జీఎస్ అహ్లువాలియాతో కూడిన బెంచ్ మహిళ కొంత కాలం సదరు వ్యక్తితో కలిసి జీవించిందనే వివరాలను గుర్తించింది. దీంతో ఆమె భరణానికి అర్హురాలే అని తీర్పు వెల్లడించింది.