Friday, December 27, 2024
Homeజాతీయంశ‌బ‌రిమ‌ల 18మెట్ల‌పై పోలీసులు ఫోటో షూట్‌

శ‌బ‌రిమ‌ల 18మెట్ల‌పై పోలీసులు ఫోటో షూట్‌

Date:

శబరిమల ఆలయం అనగానే అక్కడ ఉండే 18 మెట్లు గుర్తుకు వస్తాయి. మాల ధారణ చేసి, కఠోర నియమ నిష్ఠలను పాటించి, ఇరుముడి కట్టుకుని వచ్చిన భక్తులకు మాత్రమే ఈ 18 మెట్లు అధిరోహించే అర్హత ఉంటుంది. సాధారణ భక్తులు ఈ మెట్లు ఎక్కడానికి అనుమతి లేదు. ఈ 18 మెట్లను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు భక్తులు. వాటిని పదునెట్టంబాడిగా పిలుస్తారు. భక్తి ప్రపత్తులతో పూజిస్తారు. తొలి అయిదు మెట్లను పంచేంద్రియాలతో సమానంగా భావిస్తారు. ఆ తరువాతి ఎనిమిది మెట్లు కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్య, అలసత్వాన్ని సూచిస్తాయని నమ్ముతారు.

చివరి మూడు మెట్లు సత్వ, తమో, రజో గుణాలు, చివరి రెండు మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. ఆ 18 మెట్లను అధిరోహించి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వల్ల వాటన్నింటిని త్యజించినట్టవుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పదునెట్టంబాడపై పోలీసులు గ్రూప్ ఫొటో దిగడం వివాదానికి కేంద్రబిందువు అయంది. సన్నిధానం వద్ద భక్తుల భద్రత కోసం నియమించిన పోలీసులు ఈ 18 మెట్లపై నిల్చుని ఫొటో దిగారు. ఆ సమయంలో వాళ్లంతా యూనిఫాంలో ఉన్నారు. అయ్యప్ప స్వామికి వ్యతిరేక దిశలో నిల్చుని ఫొటో దిగడం ఆలయ సంప్రదాయాలకు పూర్తి విరుద్దమంటూ భక్తులు మండిపడుతున్నారు.

దీనిపై ఆన్ మనోరమ ఓ కథనాన్ని ప్రచురించింది. అదనపు డిజీపీ శ్రీజిత్ స్పందించినట్లు తెలిపింది. ఈ ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాల్సిందిగా సన్నిధానం ప్రత్యేక అధికారిని ఆదేశించినట్లు పేర్కొంది. ఈ ఘటన పట్ల విశ్వహిందూ పరిషత్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వీజీ థంపి, ప్రధాన కార్యదర్శి వీఆర్ రాజశేఖరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.