వ్యవస్థను మోసం చేసే వ్యక్తి వైద్యుడైతే.. సమాజానికి ఎంత హానికరమో ఆలోచించాలని సుప్రీంకోర్టు జాతీయ పరీక్ష మండలిపై తీవ్రంగా మండిపడింది. ఎక్కడైనా 0.001 శాతం నిర్లక్ష్యం ఉన్నా.. దాన్ని సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. పరీక్ష నిర్వహిస్తున్న సంస్థగా.. న్యాయంగా వ్యవహరించాలి. ఏదైనా తప్పిదం జరిగితే.. తప్పు జరిగిందని అంగీకరించాలి. ఈ చర్యలు తీసుకోనున్నాం అని వివరించాలి. కనీసం అదైనా మీ పనితీరుపై విశ్వాసం కలిగిస్తుంది” అని ఎన్టీఏకు సుప్రీం ధర్మాసనం పేర్కొంది. దేశంలోనే అత్యంత కఠినమైన పరీక్షకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు పడే శ్రమను మరిచిపోకూడదని తెలిపింది. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన నీట్ పరీక్షను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ విక్రమనాథ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. ఎన్టీఏ నుంచి సకాలంలో చర్యలు ఆశిస్తున్నామన్న ధర్మాసనం.. తదుపరి విచారణను జులై 8న చేపడతామని తెలిపింది.
అంతకుముందు ఇదే అంశంపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. నీట్-యూజీ (2024) పరీక్ష పవిత్రతకు విఘాతం కలిగిందని వ్యాఖ్యానించింది. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్‌టీఏపైనే ఉందని తెలిపింది. ప్రశ్నపత్రం లీకేజీ, ఇతరత్రా అక్రమాలు జరిగినందున ఈ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని కేంద్రం, ఎన్‌టీఏలను ఆదేశించింది. అయితే, ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియను నిలిపివేసేందుకు మాత్రం నిరాకరించిన సంగతి తెలిసిందే.