కేరళ రాష్ట్రం వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 180 మందికి పైగా మృతిచెందిన ఘటన యావత్ దేశాన్ని కలిచి వేస్తోంది. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వయనాడ్ విషాదంపై అదానీ గ్రూప్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబసభ్యులకు ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇలాంటి సమయంలో కేరళ ప్రజలకు అదానీ గ్రూప్ అండగా నిలబడుతుందని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు.
అదానీ గ్రూప్‌తో పాటు, ఆర్పీ గ్రూప్ రవి పిళ్లై, లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ ఎం.ఎ.యూసఫ్ అలీ, కల్యాణ్ జువెలర్స్ ఛైర్మన్ ఎండీ టి.ఎస్.కల్యాణరామన్‌లు కూడా ఒక్కొక్కరూ రూ.5కోట్ల విరాళాన్ని సీఎం సహాయనిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. వయనాడ్ ఘటనపై నటుడు విక్రమ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు మలయాళ చిత్ర పరిశ్రమ వయనాడ్ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. కొన్ని రోజుల పాటు సినిమా ఫంక్షన్లు, కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్లు పలు చిత్ర బృందాలు ప్రకటించాయి.