రోజురోజుకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్న డీ-మార్ట్ లాభాల బాటలో దూసుకుపోతుంది. డీ-మార్ట్ పేరిట రిటైల్ చైన్‌ను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- జూన్ త్రైమాసిక ఫలితాలను వెలువరించింది. తొలి త్రైమాసికంలో రూ.773.8 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది లాభం రూ.659 కోట్లతో పోలిస్తే 17.5 శాతం వృద్ధి నమోదైందని తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. కంపెనీ ఆదాయం సైతం 18.6 శాతం వృద్ధితో రూ.14,069 కోట్లుగా నమోదైంది.
సమీక్షా త్రైమాసికంలో డీమార్ట్ ఎబిటా 18 శాతం పెరిగి రూ.1221.3 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇది రూ.1035.3 కోట్లుగా ఉంది. కంపెనీ మార్జిన్ 8.68 శాతంగా ఉంది. ఇదే త్రైమాసికంలో డీమార్ట్ కొత్తగా మరో ఆరు స్టోర్లను తెరిచింది. దీంతో జూన్ చివరి నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 371కి చేరింది. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో శుక్రవారం బీఎస్ఈలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు 1.15 శాతం లాభంతో రూ.4953 వద్ద ముగిసింది.